21, ఫిబ్రవరి 2011, సోమవారం

గగనం సినిమా చూడద్దు..

అవును ఈ సినిమా మీరు పొరపాటున కూడా చూడవద్దు.. భలేవారే ఇలాంటి సినిమాలను థియేటర్ లో చూసి ప్రోత్సహిస్తే ఇంకేమన్నా ఉందా !! తెలుగు నిర్మాతలు దర్శకులు ధైర్యం చేసి ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీసేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగు పడిపోదుటండీ అపుడు మనం మన ఇండస్ట్రీని తిడుతు ఇతర భాషల సినిమాలని పొగడటం ఎలా వీలవుతుంది చెప్పండి... అందుకే మీరీ సినిమా చూడద్దండీ...

పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు హాలీఉడ్ ని చూసి టాలీఉడ్ అని పేరు పెట్టుకుంటాం కానీ వాళ్ళని చూసి వాళ్ళలా సినిమాను సినిమాగా చూపించే మంచి సినిమాలు తీయాలని అనుకుంటే ఎలా !! ఒకవేళ పొరపాటున ఎవరైనా తీసినా వాటిని చూసి హిట్ చేసేస్తే ఎలా !! అందుకే ఈ సినిమా ఎవరూ చూడకుండా సినిమాను అట్టర్ ప్లాప్ చేస్తే కానీ ఈ దర్శక నిర్మాతల తిక్క కుదరదు.. మళ్ళీ ఇలాంటి సినిమాల జోలికి వెళ్ళకుండా ఉంటారు. అపుడు మనం ఎంచక్కా ఒక వెకిలి హీరోను మాస్ పేరు చెప్పుకుని అతను చెప్పే నాలుగు బూతు డైలాగులు, ఊర ఫైట్లు.. ఇద్దరేసి  హీరోయిన్లు, వాళ్ళ అంగాంగ ప్రదర్శనలు, రెచ్చగొట్టే పాటలు, దిక్కుమాలిన ప్రేమకథలు, ఫ్యాక్షన్ కథలు, మితిమీరిన హింస, వెకిలి హాస్యం ఇలాంటి నవరసాలు రంగరించి వండి వార్చిన ఫార్ములా సినిమాలు చూసుకుంటూ తెలుగు సినిమా రోజు రోజుకూ దిగజారిపోతుందని స్టేట్మెంట్ లు ఇచ్చుకుంటూ ఆనందంగా కాలం గడపవచ్చు.

అసలా రాధామోహన్ కి సినిమాలు తీయడం రాదండీ.. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరోని పెట్టుకుని ఒక అందమైన హీరోయిన్ ని పెట్టకుండా, రొమాంటిక్ సీన్స్ లేకుండా, మాంచి పాటలు లేకుండా సినిమా తీయాలని ఎలా అనిపించిందండీ అతనికి పైత్యం ప్రకోపించడం కాకపోతే... ఇతని విషయం ఇంతకు ముందే ఆకాశమంత సినిమా తీసినపుడే చెప్పానండీ నేను, త్రిషలాంటి అందమైన హీరోయిన్ డేట్స్ పెట్టుకుని ఎక్స్పోజింగ్ లేకుండా జిల్లుమనే డ్యాన్సులు లేకుండా తండ్రీకూతుళ్ళ ఎమోషన్స్ మీద సినిమా తీయడం ఏంటండి.

ఇతనికి ప్రేక్షకులనాడి పట్టుకోవడం తెలీదండీ ఏదో తను నమ్మిన సిద్దాంతం ప్రకారం మంచిసినిమా అని తను అనుకున్న విధంగా సినిమా తీయడం మాత్రమే తెలుసండీ.. ఇలాంటివాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం బ్రతకలేరండీ నేను చెప్తున్నాను కదా మీరే చూస్తారు చూడండి. అందుకే చెప్తున్నానండీ ఒకళ్ళిద్దరు బాగుంది అన్నంత మాత్రాన ఈ సినిమాని మీరు చూసి ప్రోత్సహించద్దండీ.. తెలుగు సినిమాని ఇలాగే సర్వనాశనమైపోనిద్దాం... ఎవరైనా మంచి సినిమాలు తీసి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేసి వాళ్ళకి బుద్ది చెబుదాం...
ఇంక ఈ సినిమాలో అసలు హాస్యం లేదండీ.. ఉన్నా నవ్వురాలేదండీ.. హాస్యమంటేనండీ చిన్నకమెడియన్ ని పెద్దకమెడియన్స్ తన్నడమో, అక్రమసంభంధాలో, బూతు డైలాగులో, మాడా వేషాలో ఉండాలి కానండీ ఈ సినిమాలోలా ప్రత్యేకంగా క్యామిడీ ట్రాక్ లేకుండా సన్నివేశాల్లో కలిసిపోయే అదేదో సటిల్(subtle) హ్యుమర్ అంటారంట కదా అలాంటిది ఉంటే ఎలా అర్ధమవుద్దండీ.. అసలు అలాంటి కామెడీ పెట్టి ఎవుడన్నా సినిమాతీస్తారుటండీ.. ఆకాశమంత లోకూడా ఇంతే కదండీ అలాంటి కామెడీనే ఉంటదండి చాలా సిరాకేసిద్దండీ ఆ సినిమా అందుకే... ఈ సినిమాలొ కామెడీ కూడా అంతేఉందండి...

ఇంకా నాతో పాటు సినిమాచూసినోళ్ళు స్క్రీన్ ప్లే చాలా చక్కగా అల్లుకున్నాడు రా ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ట్విస్ట్ తో గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు అంటున్నారండీ.. నాకైతే ఏమంత గొప్పగా అనిపించలేదండీ ఐనా ఈ ట్విస్ట్ లు ఏం ట్విస్ట్ లు మొన్నటికి మొన్న రగడ సినిమాలో చూశారా నా సామిరంగ ఎన్ని ట్విస్ట్ లో అయ్యండీ ట్విస్ట్ లంటేనూ ఈ సినిమాలోదికూడా ఒక ట్విస్టేనా... ఏదేమైనా మీరు మాత్రం మీకు తెలిసినవాళ్ళకందరికీ చెప్పండేం ఈ సినిమాని పొరపాటున కూడా చూడద్దని చూసి మంచి సినిమాలని అస్సలు ప్రోత్సహించద్దనీ మర్చిపోకుండా చెప్పండి.

7 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

సెటైర్ బావుంది.

Indian Minerva చెప్పారు...

మీ బాధేంటండీ? అహ ఏంటట? ఇప్పుడు దీన్ని సూసెయ్యాలి అంతేగదా? వాకే... రేపే సూసేద్దాం :)

శుభకరుడు చెప్పారు...

కొత్తపాళీ గారు ధన్యవాదాలు ః)

ఇండియన్ మినర్వా గారు అంతేగదండీ మరి చూసేయండి, ధన్యవాదాలు ః)

అన్నట్లు నేను చెప్పాను కదా అని ఓ అత్యధ్బుతమైన కళాఖండాన్ని ఊహించేసుకుని ఎల్లబాకండి అంచనాలు చతికిలబడే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ సినిమాలో కూడా బోలెడు లోపాలున్నాయి కానీ వాటిని క్షమించేసి ప్రోత్సహించదగిన సినిమా.. కనుక ఏ అంచనాలు లేకుండా చూడండి.. రాధామోహన్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయడు, నాదీ హామీ.

అజ్ఞాత చెప్పారు...

Chapparu Kadandi ..Online lo chusthunna....director ni encourage cheyadaniki but bad for producer... :)

ఆ.సౌమ్య చెప్పారు...

సూపరు....మంచి సెటైర్..మొదట టైటిల్ చూసి బోలెడు ఆశ్చర్యపోయి...ఇదేమిటబ్బా అని చదవడానికొచ్చా...బలే రాసారులెండి. :)

సుమలత చెప్పారు...

బలే రాసారండి. సినిమా చూడద్దు అని బలే
చూడమంటున్నారు

శుభకరుడు చెప్పారు...

మహేష్ గారు, అజ్ఞాత గారు, ఆ.సౌమ్యగారు, సుమలత గారు ధన్యవాదములు.

నేనెవరినంటే!!

విశాఖపట్నం, India
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు !!