అవును ఈ సినిమా మీరు పొరపాటున కూడా చూడవద్దు.. భలేవారే ఇలాంటి సినిమాలను థియేటర్ లో చూసి ప్రోత్సహిస్తే ఇంకేమన్నా ఉందా !! తెలుగు నిర్మాతలు దర్శకులు ధైర్యం చేసి ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీసేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగు పడిపోదుటండీ అపుడు మనం మన ఇండస్ట్రీని తిడుతు ఇతర భాషల సినిమాలని పొగడటం ఎలా వీలవుతుంది చెప్పండి... అందుకే మీరీ సినిమా చూడద్దండీ...
పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు హాలీఉడ్ ని చూసి టాలీఉడ్ అని పేరు పెట్టుకుంటాం కానీ వాళ్ళని చూసి వాళ్ళలా సినిమాను సినిమాగా చూపించే మంచి సినిమాలు తీయాలని అనుకుంటే ఎలా !! ఒకవేళ పొరపాటున ఎవరైనా తీసినా వాటిని చూసి హిట్ చేసేస్తే ఎలా !! అందుకే ఈ సినిమా ఎవరూ చూడకుండా సినిమాను అట్టర్ ప్లాప్ చేస్తే కానీ ఈ దర్శక నిర్మాతల తిక్క కుదరదు.. మళ్ళీ ఇలాంటి సినిమాల జోలికి వెళ్ళకుండా ఉంటారు. అపుడు మనం ఎంచక్కా ఒక వెకిలి హీరోను మాస్ పేరు చెప్పుకుని అతను చెప్పే నాలుగు బూతు డైలాగులు, ఊర ఫైట్లు.. ఇద్దరేసి హీరోయిన్లు, వాళ్ళ అంగాంగ ప్రదర్శనలు, రెచ్చగొట్టే పాటలు, దిక్కుమాలిన ప్రేమకథలు, ఫ్యాక్షన్ కథలు, మితిమీరిన హింస, వెకిలి హాస్యం ఇలాంటి నవరసాలు రంగరించి వండి వార్చిన ఫార్ములా సినిమాలు చూసుకుంటూ తెలుగు సినిమా రోజు రోజుకూ దిగజారిపోతుందని స్టేట్మెంట్ లు ఇచ్చుకుంటూ ఆనందంగా కాలం గడపవచ్చు.
అసలా రాధామోహన్ కి సినిమాలు తీయడం రాదండీ.. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరోని పెట్టుకుని ఒక అందమైన హీరోయిన్ ని పెట్టకుండా, రొమాంటిక్ సీన్స్ లేకుండా, మాంచి పాటలు లేకుండా సినిమా తీయాలని ఎలా అనిపించిందండీ అతనికి పైత్యం ప్రకోపించడం కాకపోతే... ఇతని విషయం ఇంతకు ముందే ఆకాశమంత సినిమా తీసినపుడే చెప్పానండీ నేను, త్రిషలాంటి అందమైన హీరోయిన్ డేట్స్ పెట్టుకుని ఎక్స్పోజింగ్ లేకుండా జిల్లుమనే డ్యాన్సులు లేకుండా తండ్రీకూతుళ్ళ ఎమోషన్స్ మీద సినిమా తీయడం ఏంటండి.
ఇతనికి ప్రేక్షకులనాడి పట్టుకోవడం తెలీదండీ ఏదో తను నమ్మిన సిద్దాంతం ప్రకారం మంచిసినిమా అని తను అనుకున్న విధంగా సినిమా తీయడం మాత్రమే తెలుసండీ.. ఇలాంటివాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం బ్రతకలేరండీ నేను చెప్తున్నాను కదా మీరే చూస్తారు చూడండి. అందుకే చెప్తున్నానండీ ఒకళ్ళిద్దరు బాగుంది అన్నంత మాత్రాన ఈ సినిమాని మీరు చూసి ప్రోత్సహించద్దండీ.. తెలుగు సినిమాని ఇలాగే సర్వనాశనమైపోనిద్దాం... ఎవరైనా మంచి సినిమాలు తీసి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేసి వాళ్ళకి బుద్ది చెబుదాం...
ఇంక ఈ సినిమాలో అసలు హాస్యం లేదండీ.. ఉన్నా నవ్వురాలేదండీ.. హాస్యమంటేనండీ చిన్నకమెడియన్ ని పెద్దకమెడియన్స్ తన్నడమో, అక్రమసంభంధాలో, బూతు డైలాగులో, మాడా వేషాలో ఉండాలి కానండీ ఈ సినిమాలోలా ప్రత్యేకంగా క్యామిడీ ట్రాక్ లేకుండా సన్నివేశాల్లో కలిసిపోయే అదేదో సటిల్(subtle) హ్యుమర్ అంటారంట కదా అలాంటిది ఉంటే ఎలా అర్ధమవుద్దండీ.. అసలు అలాంటి కామెడీ పెట్టి ఎవుడన్నా సినిమాతీస్తారుటండీ.. ఆకాశమంత లోకూడా ఇంతే కదండీ అలాంటి కామెడీనే ఉంటదండి చాలా సిరాకేసిద్దండీ ఆ సినిమా అందుకే... ఈ సినిమాలొ కామెడీ కూడా అంతేఉందండి...
ఇంకా నాతో పాటు సినిమాచూసినోళ్ళు స్క్రీన్ ప్లే చాలా చక్కగా అల్లుకున్నాడు రా ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ట్విస్ట్ తో గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు అంటున్నారండీ.. నాకైతే ఏమంత గొప్పగా అనిపించలేదండీ ఐనా ఈ ట్విస్ట్ లు ఏం ట్విస్ట్ లు మొన్నటికి మొన్న రగడ సినిమాలో చూశారా నా సామిరంగ ఎన్ని ట్విస్ట్ లో అయ్యండీ ట్విస్ట్ లంటేనూ ఈ సినిమాలోదికూడా ఒక ట్విస్టేనా... ఏదేమైనా మీరు మాత్రం మీకు తెలిసినవాళ్ళకందరికీ చెప్పండేం ఈ సినిమాని పొరపాటున కూడా చూడద్దని చూసి మంచి సినిమాలని అస్సలు ప్రోత్సహించద్దనీ మర్చిపోకుండా చెప్పండి.
సినిమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21, ఫిబ్రవరి 2011, సోమవారం
16, ఫిబ్రవరి 2011, బుధవారం
ఏక్ మినిట్!! అబ్బా తమ్ముడూ!!
ఈ బ్లాగ్ ఇలా "అలా మొదలైంది" సినిమా కి సంబందించిన పోస్ట్ తో మొదలు పెడుతున్నందుకు చాలా హ్యాప్పీస్. ఇప్పటికే ఈ సినిమా మీలో చాలా మంది చూసి ఉంటారు. లేదంటే తప్పక చూసేయండి మిస్ అవకూడని ఒక మంచి సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఒక పాత్ర గురించి పరిచయం చేద్దామని ఈ పోస్ట్.
ఐస్ ఏజ్ సినిమా చూసిన వారికి అందులోని ఉడుత గుర్తుండే ఉంటుంది. దాన్ని Scrat ("saber-toothed squirrel") అంటారు Scrat is obsessed with acorns, constantly putting his life in danger to obtain and defend them. ఆ ప్రాసెస్ లో దాని లైఫ్ ని ఇతరుల లైఫ్ ని నానా కష్టాలలో పడేస్తుంది విపత్తులను సృష్టిస్తుంది. అలామొదలైందిలో మన గౌతం కూడా సరిగ్గా అలాంటి పాత్రే... ఇతను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిసెషన్ లో జాబ్ పోయిందిట ఏ పనైనా చేయడానికి సిద్దం కానీ పెళ్ళి ఇంట్లోకి వెళ్తే తాగున్నాడని ఎవరూ లెక్కచేయడంలేదు ఏదో పని ఇప్పించండి తమ్ముడూ అని తిరుగుతుంటాడు అలాంటివాడికి పెళ్ళికూతురిని కిడ్నాప్ చేయాలన్న ఐడియా వినపడుతుంది. ఇక మనవాడు ఆ మాట పట్టుకుని సినిమా క్లైమాక్స్ లొ చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ సినిమా చివర్లో ఇతని ద్వారా సృష్టించిన హాస్యం చాలా నవ్వించింది. ఒక తాగుబోతు పాత్రలో జీవించాడు.
నిజానికి నాకు సినిమాల్లో తాగుబోతు పాత్రలు సృష్టించే హాస్యం చాలా ఇష్టం, ఇప్పటి వరకూ ఎంత మంది వేసినా ఈ పాత్రలో ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం తీసుకు రావడంలో దర్శకులు సక్సెస్ అవుతూనే ఉంటారు. తెలుగు సినిమాల్లో ఎంఎస్ నారాయణ ఇప్పటివరకు ఇలాటి పాత్రల్లో రాణించేవారు, ఇపుడు ఇతను విపరీతంగా నవ్విస్తున్నాడు. ఊగిపోవడం తల ఊపడం అచ్చంగా అలానే అనుకరిస్తున్నాడు. ఇంత టాలెంట్ అండ్ అబ్సర్వేషన్ ఎక్కడిదయ్యా అని కాస్త వివరాలు కనుక్కుంటే తెలిసిన విషయం అతనిపై అభిమానం మరింత పెంచింది. తను చిన్నప్పుడు తన తండ్రి తాగివచ్చి అమ్మని కొట్టేవాడనీ ఆయన మళ్ళీ బయటకి వెళ్ళాక అమ్మని నవ్వించడానికి తన తండ్రిని అనుకరించి తాగుబోతులా నటించేవాడినని అలాగే అంత పర్ఫెక్ట్ మ్యానరిజమ్స్ అలవాటయ్యాయని చెప్పాడు. ఒక విషాదం నుండి వినోదాన్ని జీవనోపాధిని వెతుకున్న ఇతన్ని అభినందించాల్సిందే.. అతనికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నవారిని కూడా అభినందించాలి.
ఇదివరకే జగడం, మహత్మ లాంటి ఒక పది సినిమాలు వరకూ నటించినా మహాత్మ లో కాస్త పేరు వచ్చింది తర్వాత ఈ సినిమాతోనే మళ్ళీ ఇంత పేరు తెచ్చుకున్నాడు. మహత్మ సినిమాలో కూడా ఎవడు మందు పోయిస్తే ఆ పార్టీవాడికి జైకొట్టే పాత్రలో జీవిస్తాడు ఆ సినిమాలో సైతం అతనున్న సీన్స్ లో ఫోకస్ అతని మీద లేకపోయినా నిజంగా తాగిన వ్యక్తి ఎలా ఐతే ఆ మొత్తం సన్నివేశానికి ఎలా రియక్ట్ అవుతాడో అలా తన పరిధిలో తను నటించేసి ఊగిపోతూ తమాషాగా తల ఊపుతూ చొక్కా చేతులు మడుస్తూ కొట్లటకు సిద్దపడుతూ ఆకట్టుకుంటాడు. ఇండస్ట్రీలో తాగుబోతు రమేష్, మహత్మా రమేష్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ నటుడు మరిన్ని మంచి పాత్రలు చేసి వృద్దిలోకి రావాలని కోరుకుంటున్నాను.
నేనెవరినంటే!!
- శుభకరుడు
- విశాఖపట్నం, India
- పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు !!