24, ఫిబ్రవరి 2011, గురువారం

రమణా మీకిది తగునా !!


ఎంతపని చేశావయ్యా రమణా... అప్పుడే అంత తొందరేం వచ్చిందని...
నాలాంటి నీ అభిమానుల కోసమో.. నీలాంటి నీ ప్రాణమిత్రుడు బాపూ కోసమో..    
తెలుగు తనం కోసమో.. గిలిగింతలు పెట్టే హాస్యం కోసమో.. వ్యంగ్యం కోసమో..
మరికొన్నాళ్ళుంటే నీ సొమ్మేం పోయింది...

ఆ పై వాడు కబురంపగానే లగెత్తుకుని వెళ్ళిపోవడమేనా !!

“ఝాఠర్ ఢమాల్ !! నేనప్పుడే రాను.. తెలుగు పాఠకులకు అందించాల్సిన అమృత గుళికలు ఇంకా చాలా ఉన్నాయ్ నువ్వు ఇప్పుడెళ్ళి మళ్ళీ ఒక ఫ్ఫదీ ముఫ్పై ఏళ్ళ తర్వాతెప్పుడైనా రా పో !! అని అంటే ఆ దేవుడు మాత్రం కిమ్మనకుండా వెనుదిరిగి వెళ్ళిపోయుండేవాడు కాదూ...  

ఓహో కష్టాలను కూడా ఇష్టాలుగా నవ్వుతూ అలవోకగా భరించేయండిరా అని నువ్వు నేర్పిన నీతిని మేమెంత బాగా పాటిస్తున్నామో పైనుండి చూడాలని వెళ్ళిపోయావా.. మాకు నీ అంత గుండెధైర్యమెక్కడిదయ్యా... నువ్వు లేవని ఇక పై రాయలేవనీ.. గుండె చెరువయ్యేలా తెలుగు తెలిసిన ప్రతిఒక్కరూ కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉన్నారే రాత్రినుండీ :-( మా ఈ దుఃఖ్ఖం ఆగేదెపుడు.. నీ ప్రాణ స్నేహితుడు బాపూను ఓదార్చగలిగేదెవరు..

1 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

అటు చూడు
"హన్నా" అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు
"ప్రైవేట్" చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు
"సెగట్రీ" నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు
"అరుణ" 'అప్పు'డే ఋణం తీర్చుకోద్దంటోంది
"రాధా గోపాళం" రావా రమణా అని పిలుస్తున్నారు

సర్లే ఇవన్నీ వదిలేయి. అటు చూడు బాపు కళ్ళలో ...తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ? అయినా
నీ ఆత్మ బాపులో
బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు
తన అనుమతి లేకుండా
పరమాత్మను చేరే హక్కు నీ కెక్కడ రమణా?

http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post_24.html

నేనెవరినంటే!!

విశాఖపట్నం, India
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు !!